తెలుగు

కడలి అంచులు దాటి కదిలింది తెలుగు..

ఎదల లోతులు మీటి ఎగసింది తెలుగు..

ఏ భాష చెణకైన ఏ యాస చినుకైన

తనలోన కలుపుకొని తరలింది తెలుగు..


కోటి తెలుగుల బంగారు కొండ క్రింద

పరచుకొన్నట్టి సరసు లోపల వసించి

ప్రొద్దుప్రొద్దున అందాల పూలు పూయు

నా తెలంగాణతల్లి కంజాతవల్లి!


వెన్నెల్లో ప‌డ‌వ ప్ర‌యాణం చేస్తూ అప్పుడే విక‌సించిన మ‌ల్లెపూల‌ను ఆఘ్రాణిస్తే క‌లిగే గొప్ప అనుభూతి తెలుగు భాష వింటున్న‌ప్పుడు క‌లుగుతుంది. --- సుబ్ర‌హ్మ‌ణ్య భార‌తి

తెలుగు వీనుల‌కు విందు. ద్రావిడ భాష‌ల్లోకెల్లా మ‌ధురాతి మ‌ధురం. చ‌దువురాని వాడు మాట్లాడినా చెవులకింపుగా ఉంటుంది --- హెన్రీ మోరిస్

      మనం.. ఘనం
       

ప్రపంచ వాఙ్మయములో మొదటి కవిత మనది, మొదటి అర్థశాస్త్రము మనది, మొదటి వైద్య గ్రంథము మనది, మొదటి చిత్రలేఖనము మనది, మొదటి కామశాస్త్రము మనది, మొదటి కథ మనది, మొదటి వ్యాకరణము మనది. ఈ విధముగా లెక్కించి వివరించుచూపోయిన గ్రంథము చాలా పెరిగిపోవును. ఇంగ్లీషువారు వ్రాసిన చరిత్రలలోను, వారి విజ్ఞాన కోశాలలోను మనలోని గొప్పవారిని గురించి ముచ్చట్లు కానరావు. లోకోత్తర చిత్రలేఖనములలో అజంతా పేరే లేదు. లోకోత్తర శిలా శిల్పములలో మన ఎల్లోరాను స్మరించుట అరుదు. యూక్లిడ్‌ సూత్రాలనే పేర్కొందురుకాని మన శుల్బ సూత్రాల నడుగరు. మన వరాహ మిహిరుడు, లీలావతీ కర్తయగు భాస్కరాచార్యుడు వారికి కానరాలేదు. బీజ గణితమును మనము కనిపెట్టితే ఖఆల్‌జీబ్రా’ను అరబ్బులే కనిపెట్టిరని ప్రచారము చేసిరి. 300 ఏండ్ల క్రిందట వెనిసులో గ్యాలిలియో అను మహా మేధావి పుట్టి సూర్యుని చుట్టే భూమి గిర్రున తిరుగుతుందయ్యా అని అనగానే అతన్నిబట్టి బైబిల్‌ బోధలనబద్ద మందువా నీ తల కాచుకో అని పీడించి క్షమాపణ పత్రికను క్రైస్తవాచార్యులు వ్రాయించుకొనిరి. గ్యాలిలియో నక్షత్రశాస్త్ర మంతద్భుత పరిశోధకుడని కీర్తించుచున్నారు కదా. అతనికంటే 1200 ఏండ్లకు ముందు క్రీ.శ. 476లో నుండిన మన ఆర్యభటుడు సూర్య సిద్ధాంత గ్రంథము ద్వారా గ్యాలిలియో చూపించిన విషయాన్నే కాక ఇంకా ఇతరాంశములను, భూమికి సూర్యునికి, భూమికి చంద్రునికి ఉండు అంతరాయమును ఈనాడు టెలిస్కోపు యంత్రాలతో చూచి గుణించిన పాశ్చాత్యుల లెక్కలకు ఇంచుమించు సరిపోవునట్లుగా ఆనాడే తెలిపి యుండెనుకదా? అతని పేరెందైనా ఉదాహరింతురా? అతడు ప్రసిద్ధుడు కాడు. ఆనాడే అతని కీర్తి రోము వరకు వ్యాపించెను. అరబ్బులతణ్ణి అర్జబహార్‌ అని తమ అస్తవ్యవస్తపు బాసలో పేర్కొనిరి. రోమకులు అరబ్బుల నుండి ఆ పేరును గ్రహించి అర్దుబారియస్‌ అనిరి. పాశ్చాత్యులకు ఈసఫ్‌ కలడుకాని గుణాఢ్యుడు కాని విష్ణుగుప్తుడు కాని కానరాలేదు. కాక్‌, లివింగ్‌స్టన్‌ ప్రభృతుల చరిత్రలు వ్రాసిరి కాని కాంబోడియాను పాలించిన మన కౌండిన్యుడు కాని, చీనాలో 30 ఏండ్లుండి అచ్చటనే చనిపోయిన కుమార జీవుడుకాని, అపర బుద్ధుడు, ప్రఖ్యాతుడైన ఆర్య నాగార్జునుడు కాని వారికి జ్ఞాపకము రాలేదు. హార్వీ అను ఆంగ్లేయుడు క్రీ.శ. 17వ శతాబ్దములో శరీరముందు రక్తము ప్రవహిస్తూ వుండును అను విషయము కనిపెట్టితే అతని యా యుపజ్ఞాఫలితమే ఆధునిక పాశ్చాత్య వైద్యానికి మూలకందమని శ్లాఘించిరి. కాని అతనికంటే 1800 ఏండ్లకు ముందు మన హరీతుడు, సుశ్రుతిని కన్న ముందుండినవాడు పాండురోగ నిరూపణములో ధమనులలో అన్ని రసములు రక్తమై ప్రవహిస్తూ వుండునని వ్రాసెను. భావ ప్రకాశమను వైద్య గ్రంథము హార్వీకన్న 100 ఏండ్లు ముందు వెలిసెను. అందుకూడా హార్వీ కనిపెట్టిన విషయాన్నే తెలిపినారు. హారునల్‌ రషీద్‌ ఖలీఫా కాలములో బాగ్దాదులో నివసించి, ఖలీఫా రాజ్యమునకు వైద్యాధికారియై మన వైద్య గ్రంథములను అరబీలోనికి పరివర్తనము చేసిన మంఖుని మనమే మరచినాము. ఇట్టివనంతముగా కలవు. ఈ పరిశోధనలు చేసి ప్రపంచానికి తెలుపుకొనుట మన విధి. (సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు2 నుంచి స్వీకరణ)

తెలుగువారల తేట మాటల, తెలుగువారల తేనెపాటల తెలుగువారల మధురగీతల తెలియచెప్పర తెలుగుబిడ్డ!


ఏప్రఫుల్ల పుష్పంబులు నీశ్వరునకు పూజ సల్పితినో యిందు పుట్టినాడ కలదయేని పునర్జన్మ! కలుగుగాక మధుర మధురమౌ తెనుగు నా మాతృభాష!